బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటన.. అనుకోకుండా జరగలేదని, కుట్రపూరితంగానే జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు(టీఎంసీ) ఆరోపించారు. ఈ మేరకు టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం.. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
"నందిగ్రామ్‌లో మమతపై దాడి ఘటనలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేశాం. ఆమెపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎవరూ లేరు. ఆ ఘటనలు ఆమెను హత్య చేసేందుకు జరిగినట్లుగానే తెలుస్తోంది. కుట్రపూరితంగా దీదీపై దాడికి పాల్పడ్డారు."