పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ఒకసారి వివాహం చేసుకున్నాక ఏదేమైనా కలిసే జీవించాలని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పవిత్రమైన వివాహ బంధాన్ని తెంచుకోవటానికి ఒక్క క్షణం కూడా పట్టట్లేదు. కొంతమంది అయితే పెళ్లైన కొన్ని నెలలకే విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. ఇంకా చాలా జంటలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నాయి.
అయితే, విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటలను కలిపేందుకు ఓ న్యాయమూర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరి లోక్ అదాలత్ న్యాయమూర్తి వినోద్ కుమార్.. తమ దగ్గరికి విడాకుల కోసం వచ్చిన చాలా జంటలను ఒక్కటి చేశారు. వారికి వివాహ బంధం ప్రాముఖ్యతను తెలియజేసి కలిసి జీవించేలా చేశారు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న వృద్ధ దంపతులను సైతం ఏకం చేశారు. విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కిన వీరికి.. వివాహ బంధం కొనసాగించడం ఎంత ముఖ్యమో వివరించారు వినోద్ కుమార్. న్యాయమూర్తి మాటలు విన్న దంపతులు.. విడాకులపై వెనక్కి తగ్గారు. ఒకరికొకరు పూల మాల వేసుకుని ఇకపై జీవితాంతం కలిసే జీవించాలని ప్రమాణం చేసుకున్నారు.
ఇలా న్యాయమూర్తి వినోద్ కుమార్ అనేక కుటుంబాలను విడిపోకుండా రక్షించారు. లోక్ అదాలత్‌కు 43 కుటుంబ కలహాల కేసులు రాగా... అందులో 28 కేసుల్లో ఆయన రాజీ కుదిర్చారు. ఆయన రాజీకుదర్చడం వల్ల- ఎంతోకాలంగా విడాకులు కావాలని కోర్టులో పోరాడుతున్న దంపతులు, గతాన్ని మర్చిపోయి కలిసి జీవించటానికి సమ్మతించారు. దీంతో అందరూ జడ్జి వినోద్ కుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.