బిడ్డ ఎలా ఉన్నా అక్కున చేర్చుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. కానీ కర్ణాటకలోని ఓ చిన్నారి విషయంలో అలా జరగలేదు. గ్రహణ మొర్రితో పుట్టిన ఆ నవజాత శిశువును బాక్సులో పెట్టి చెత్తలో పారేశారు ఓ తల్లిదండ్రులు. ఈ అమానవీయ ఘటనను చూసిన స్థానికులు ఇలా చేయడానికి ఆ తల్లిదండ్రులకు చేతులెలా వచ్చాయని అంటున్నారు.
'అమ్మా నేనేం చేశాను.. ఇలా పుట్టడమే పాపమా?'.. ఓ చిన్నారి ఆవేదన! - Cleft lip baby in karnataka
తన బిడ్డ గ్రహణ మొర్రితో పుట్టిందని అభం శుభం తెలియని ఓ చిన్నారిని బాక్సులో పెట్టి పడేశారు తల్లిదండ్రులు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
కర్ణాటకలోని తయార్సి-కడకేరి నుంచి గుడ్డెకొప్పకు వెళ్లే రహదారిలో ఓ చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ఆ ప్రాంతమంతా గాలించగా వారికి బాక్సులో ఓ నవజాత శిశువు కనిపించింది. దీంతో షాక్కు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని చేరదీసి శిశు సంరక్షణ అధికారులకు కాల్ చేసి జరిగిందంతా వివరించారు. ఆ తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి చేరుకున్న చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. శిర్సీలోని దత్తత కేంద్రానికి చిన్నారిని సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి వైక్యలం వల్లే తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.