Infosys Jobs: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కు సువర్ణావకాశం కల్పించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. టెక్ రంగంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. బుధవారం నాస్కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోబోతున్నట్లు సలీల్ పరేఖ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20 శాతం మేర వృద్ధి ఉండే అవకాశం ఉందని చెప్పారు. కంపెనీలో చేరి, ఎదిగేందుకు ఫ్రెషర్స్‌కు ఇదో సదావకాశం అని చెప్పారు.