Nandan Nilekani IIT Bombay : ఐఐటీ ముంబయికి రూ. 315 కోట్ల విరాళాన్ని అందించారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని. ఈ సంస్థతో తనకున్న 50 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను.. ఐఐటీ ముంబయిలో కల్పించేందుకు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ రూ. 315 కోట్లను అందజేశారు నందన్ నీలేకని. 1973లో.. బ్యాచిలర్ డిగ్రీ కోసం ఐఐటీ ముంబయిలో చేరిన నీలేకని.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టాను పొందారు. అంతకు ముందు కూడా ఇదే సంస్థకు రూ.85 కోట్లను విరాళంగా అందించారు నందన్ నీలేకని.
"ఐఐటీ ముంబయి నా జీవితానికి ఒక కీలక మలుపు రాయి. ఇది నా గమ్యానికి పునాది వేసింది. ఈ సంస్థతో నాకున్న 50 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా రేపటి దేశ భవిష్యత్ కోసం పనిచేసే విద్యార్థుల కోసం ఈ విరాళం అందిస్తున్నాను. ఐఐటీ ముంబయి నాకెంతో ఇచ్చింది." అని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. తాము చదువుకున్న విద్యాసంస్థకు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన అతికొద్ది మందిలో నందన్ నీలేకని చేరారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన నందన్ నీలేకనికి.. ఐఐటీ ముంబయి కృతజ్ఞతలు తెలిపింది.
నందన్ నీలేకని కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందినవారు. ఆయన 1981లో నారాయణ మూర్తితోకలిసి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన ఇన్ఫోసిస్నుస్థాపించారు. 2002 ఆ సంస్థకు సీఈఓగానూ వ్యవహరించారు. 2006లో నందన్‌ను పద్మభూషణ్ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది. 2009- 2014 మధ్యకాలంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)కి మొదటి ఛైర్మన్‌గా నందన్ నీలేకని పనిచేశారు. ఆధార్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని.. యూపీఐ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. అదే విధంగా పలు ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు ఆయన సేవలందించారు.
ఐఐటీ మంబయికి నందన్ నిలేకని రూ. 315కోట్ల విరాళం
HCL శివ్ నాడార్ విరాళం రోజుకు రూ.3 కోట్లు.. తర్వాత స్థానాల్లో ముకేశ్, ప్రేమ్‌జీ..
Edelgive Hurun India Philanthropy List 2022 : హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్(77), వితరణ విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. ఇటీవల వెల్లడైన ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2022 ప్రకారం.. ఆయన ఏడాది వ్యవధిలో రూ.1161 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు. అంటే రోజుకు రూ.3 కోట్ల చొప్పున దానం చేశారన్నమాట. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ(77) రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో వరుసగా రెండేళ్లు ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉన్నారని ఆ జాబితా గుర్తు చేసింది. ముకేశ్ అంబానీ కుటుంబం(రూ.411 కోట్లు) మూడో స్థానం; బిర్లా కుటుంబం (రూ.242 కోట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. దేశీయ కుబేరుల్లో తొలిస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ(60) రూ.190 కోట్ల దాతృత్వంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ఈ నివేదిక పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.