Information Commissions Vacancies Supreme Court :కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్లలో ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే 2005 సమాచార హక్కు చట్టం 'మృత పత్రం'గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర సమాచార కమిషన్లలో ఉన్న ఖాళీలు, మొత్తం పోస్టుల సంఖ్య, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను రాష్ట్రాల నుంచి సేకరించాలని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖను ఆదేశించింది.
తెలంగాణ, ఝార్ఖండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన సుప్రీం ధర్మాసనం పరిశీలించింది. ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టు.. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది. అనంతరం దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఖాళీలను భర్తీ చేయకుంటే సమాచార హక్కు చట్టం 'చనిపోయిన పత్రం'గా మారిపోతుందని ఈ సందర్భంగా సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.
'దివ్యాంగుల చట్టం అమలవుతోందా?'
Disabled Social Security Benefits :దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలపై వివిధ రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇతర ప్రజలతో పోలిస్తే దివ్యాంగులకు ఎలాంటి పథకాలు వర్తింపజేస్తున్నారో తెలియజేయాలని స్పష్టం చేసింది. సాధారణ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పోలిస్తే దివ్యాంగులకు 25 శాతం అధిక సహకారం అందేలా చూడాలన్న '2016-దివ్యాంగుల హక్కుల చట్టం'లోని నిబంధనల అమలుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాచారం సేకరించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.