Cheetah Body Structure : నేలపై అత్యంత వేగంగా పరుగెత్తగల జీవిగా గుర్తింపు పొందిన చీతాలు సుదీర్ఘకాలం తర్వాత భారతావనిలో కాలుమోపాయి. ఈ అద్భుత జంతువులు ఇక మన దేశంలో కనువిందు చేయనున్నాయి. మెరుపు వేగానికి పర్యాయపదంగా మారిన ఈ జీవులు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఉరకగలవు. ఒలింపిక్ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ గరిష్ఠ పరుగు వేగం గంటకు 44.72 కిలోమీటర్లు. ఒక్క ఉదుటులో చీతా ఏడు మీటర్ల దూరాన్ని అధిగమించగలదు. సెకనులో నాలుగు అంగలు వేయగలదు. మూడు సెకన్లలోనే గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. ఇంత అద్భుత సామర్థ్యానికి దోహదపడేలా తయారైన ఈ జీవి దేహనిర్మాణం చాలా ప్రత్యేకం.
చీతా శరీరం చిన్నగా.. నడుం భాగం సన్నగా ఉంటుంది. పెద్ద ఊపిరితిత్తులు, గుండె, నాసిక మార్గాలు, సులువుగా వంగే వెన్నెముక, పొడవైన కాళ్లు, పెద్ద తోక వల్ల ఇది ఇంత వేగాన్ని అందుకుంటోంది.
కండరాలు:చీతా శరీర బరువులో కండరాల వాటా 50 శాతం. అందులోనూ చాలా భాగం ప్రత్యేకమైన 'ఫాస్ట్ ట్విచ్ ఫైబర్ల'తో రూపొందింది. ఈ రకం ఫైబర్లు చాలా వేగంగా, శక్తిమంతంగా సంకోచిస్తాయి. చీతా వెనుక కాళ్ల పైభాగంలోని కండరాల్లో 80 శాతం వీటితోనే తయారయ్యాయి. ఈ జీవి నడుం భాగంలోని సోయాస్ కండరం పెద్దగా ఉంటుంది. ఈ కాళ్లు బాగా వెనక్కి సాగి, అదేరీతిలో చాలా త్వరగా ముందుకు దూసుకొచ్చేలా ఇది సాయపడుతుంది. పెద్ద అంగ పడేలా తోడ్పాటు అందిస్తుంది.
పాదం:చీతా పాదాలు దృఢంగా ఉంటాయి. పులులతో పోలిస్తే అవి పూర్తి గోళాకారంలో ఉండవు. వాహనాల టైర్ల త్రెడ్ల తరహాలో పట్టును అందిస్తాయి. చీతాల పాదంలో నేలను తాకే భాగం తక్కువ. గోళ్లు పాక్షికంగా వెనక్కి రాగలవు. అథ్లెట్ల బూట్ల దిగువ భాగంలోని మేకుల్లా (ట్రాక్ క్లీట్స్) ఇవి పనిచేస్తాయి. పరుగెత్తేటప్పుడు పాదం ముందు భాగానికి అదనపు పట్టును అందిస్తాయి. చీతా పాదంలోని ఐదో వేలు.. కొంచెం పైభాగంలో ఉంటుంది. వేటాడుతున్న జీవిని కాలితో లాగి పడదోసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
వెన్నెముక:చీతాల వెన్నెముక చాలా పొడవుగా ఉంటుంది. అది ఎటుపడితే అటు కదలగలదు. పరుగులో భాగంగా కాళ్లు వెనక్కి వెళ్లినప్పుడు వెన్నెముక బాగా సాగుతుంది. కాళ్లు తిరిగి ముందుకొచ్చినప్పుడు అది ఒక స్ప్రింగ్‌లా ముడుచుకుపోగలదు.
చీతాల భుజంలోని బ్లేడ్ భాగం.. కాలర్ ఎముకకు అనుసంధానమై ఉండదు. అందువల్ల ఆ భాగం సులువుగా కదులుతుంది.
వేడి తగ్గించుకుంటూ.. :ఉరికేటప్పుడు చీతా శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. నోరు, పాదాల ద్వారా దీన్ని తగ్గించుకుంటుంది. చీతాల చర్మంపై ఉండే నల్లటి మచ్చలు కూడా వేడిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. ఆ భాగాల్లోని రోమాలు ఒకింత పొడవుగా ఉంటాయి.
చీతాలు ఒక విడతలో 30 సెకన్ల పాటే గరిష్ఠ వేగాన్ని సాధించగలవు. ఆలోపే జంతువును వేటాడాలి. అందుకే వేటలో చీతాల విజయాలు 40-50 శాతమే ఉంటాయి. వేటాడాక దాదాపు అరగంట పాటు సేద తీరాకే ఆహారాన్ని భుజిస్తాయి.