తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ధరల భూతంపై 'డైవర్షన్​' రాజకీయం'.. కేంద్రంపై విపక్షాల ధ్వజం - మాయావతి

Inflation rate in India: దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలపై డైవర్షన్​ రాజకీయం చేస్తోందని కేంద్రంపై విపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రజలను మభ్యపెట్టటం ద్వారా నిజాలను మార్చలేరని విమర్శించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రజల దృష్టిని మరల్చేందుకు దేశంలో మత కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, బీఎస్​పీ అధినేత్రి మాయావతి.

Inflation rate in India
'ధరల భూతంపై 'డైవర్షన్​' రాజకీయం'

By

Published : May 18, 2022, 7:38 PM IST

Inflation rate in India: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత్​ మరో శ్రీలంకలా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. "దేశ ప్రజలను మభ్యపెట్టడం.. నిజాలను మార్చదు. భారత్​ చాలా వరకు శ్రీలంక మాదిరిగా కనిపిస్తోంది." అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు రాహుల్​. నిరుద్యోగం, పెట్రోల్​ ధరలు, మతపరమైన హింస వంటి అంశాలపై ఇరు దేశాలను పోల్చుతూ ఓ గ్రాఫిక్​ చిత్రాన్ని షేర్​ చేశారు.

రోజువారీ అవసరాల కోసం రుణాలు: ధరల పెరుగుదలను సూచిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం పెంచేందుకు భాజపా ప్రభుత్వం కనీసం ఒక్క పాలసీని తీసుకురాలేదన్నారు. పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలపై ఓ మీడియా కథనాన్ని ట్విట్టర్​లో షేర్​ చేశారు ప్రియాంక. ప్రజల కష్టార్జితాన్ని ద్రవ్యోల్బణం హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చుల కోసం రుణాలు తీసుకోవాల్సి వస్తుందేమోనని పేద ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.

మమతా బెనర్జీ విమర్శలు:గృహ అవసరాల గ్యాస్​, చమురు ధరల పెంపుపై విమర్శలు గుప్పించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. ధరల పెరుగుదల వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మతపరమైన కలహాలు సృష్టిస్తోందన్నారు. 'డొమెస్టిక్​ గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతూ సాధారణ ప్రజలను కేంద్రం దోచుకుంటోంది. వీటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మతపరమైన అల్లర్లు సృష్టిస్తోంది.' అని మెదినీపుర్​ కళాశాల మైదానంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత.

దృష్టి మరల్చేందుకే: దేశంలోని పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు భాజపా మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. అది దేశాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. ఒక మతానికి సంబంధించిన ప్రాంతాల పేర్లను మార్చటం విద్వేషాన్ని పెంచుతుందనన్నారు. 'దీంతో ఏ క్షణమైనా దుర్భర పరిస్థితులుగా మారొచ్చు. స్వతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత జ్ఞాన్​వాపీ, మథుర, తాజ్​మహల్​ వంటి ఇతర ప్రాంతాలపై జరుగుతున్న కుట్రలతో ప్రజల మతపరమైన నమ్మకాలను దెబ్బతీయటం.. దేశాన్ని బలపరచదు.. మరింత దిగజార్చుతుంది. భాజపా ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. వారణాసిలోని జ్ఞాన్​వాపీ మసీదు, శ్రీకృష్ణుడి జన్మస్థానం మథుర, తాజ్​మహల్​లోని 22 గదులు తెరవాలని సుప్రీం కోర్టులో పిటిషన్​ వేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాయావతి.

ఇదీ చూడండి:'పెట్రోల్‌ ధర.. శ్రీలంక, పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ఎక్కువ'

ABOUT THE AUTHOR

...view details