Indrani Released: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా బెయిల్‌పై విడుదలయ్యారు. విచారణ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుండటం వల్ల ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు బుధవారం వెల్లడించింది. ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉన్న ఆమె శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్‌పై విడుదలైనందుకు సంతోషంగా ఉన్నట్లు విలేకరులతో తెలిపారు. మీడియా అడిగిన మిగతా ప్రశ్నలకు మాత్రం ఆమె స్పందించలేదు.
షీనా బోరా హత్య కేసు ఇదీ.. 2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ రాయ్ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో.. 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్యచేశారని చెప్పాడు. అంతేగాక, ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా షీనా.. ఇంద్రాణీ కుమార్తేనని తేలింది. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకొంది.