Food Delivery Boy Murder: మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ జిల్లాలో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తితో పొడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. బాధితుడ్ని సునీల్ వర్మగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం..బాధితుడు సునీల్ వర్మ(24) గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో విధులకు చేరాడు. గురువారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో కస్టమర్‌కు ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కత్తితో దారుణంగా పొడిచారు. స్థానికులు.. బాధితుడ్ని అరబిందో ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్‌వై ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం తీసుకెళ్లగా.. శుక్రవారం చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
యువకుడ్ని కత్తితో పొడిచిన తొమ్మిది మంది.. చిన్నవివాదంతో ఓ యువకుడిని.. తొమ్మిది మంది యువకులు కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడ్ని దీపక్ గైక్వాడ్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన కొంత మంది యువకులు.. రెండు గ్యాంగ్‌లుగా ఏర్పడి వాకడ్ ప్రాంతంలో మద్యం తాగడానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఓ గ్యాంగ్‌లోని యువకుడు.. అదే బృందంలో ఉన్న దీపక్ గైక్వాడ్‌ను మద్యం, సిగరెట్లు తీసుకురమ్మన్నాడు.ఆ సమయంలో మరో గ్యాంగ్‌లోని యువకుడు.. ఆ మైనర్‌ను మద్యం తీసుకురావొద్దని, బానిస కావొద్దని సలహా ఇచ్చాడు. దాంతో దీపక్ గ్యాంగ్‌లోని మిగతా యువకులంతా కోపం తెచ్చుకుని.. మైనర్‌కు సలహా ఇచ్చిన యువకుడ్ని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో మరో యువకుడు గాయపడగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మైనర్ చిన్నారితో సహా తొమ్మిది మందిని వాకడ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.