ఫ్రీ ఫైర్ గేమ్ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఫోన్లో గేమ్ ఆడుతుండగా.. పాము కాటు వేసింది. అది కూడా చలనం లేకుండా బాలుడు గేమ్‌లో నిమగ్నమైపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జరిగింది. మృతుడిని రింకూగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే..ఇందోర్ చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి పిల్లాడు ఫోన్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. పెద్దవారు పనిచేస్తున్న సమయంలో ఒళ్లు తెలియకుండా ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. అయినా అతడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడ్ని గుర్తించిన.. ఆ ఇటుక బట్టీ యజమాని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స చేస్తుండంగానే బాలుడు మృతి చెందాడు.
"బాలుడి తండ్రి చందన్నగర్లో ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్. గత రెండేళ్లుగా ఇతడు ఇక్కడ పని చేస్తున్నారు. అతడి కుమారుడు పాము కాటుతో చనిపోయాడు" అని చెప్పారు చందన్నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.