సైన్యంలోకి మహిళా సిబ్బందిని తీసుకునే ముందు వారికి వర్జినిటీ పరీక్షలు నిర్వహించే విధానానికి ఇండోనేసియా స్వస్తి పలికింది. ఇలాంటి పరీక్షలకు ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఏడేళ్లకు ఈ నిర్ణయం తీసుకుంది.
జననాంగంపై చేతులతో తడిమి చూసే పరీక్షలను ఇకపై నిర్వహించబోమని ఆర్మీ చీఫ్ జనరల్ అందికా పెర్కసా పేర్కొన్నారు. శారీరక శిక్షణకు అర్హులో కాదో అన్న అంశాన్నే ఇక నుంచి పరిశీలిస్తామని తెలిపారు. వర్ణాంధత్వం, వెన్నెముక, గుండె సంబంధిత సమస్యలపై పరిశీలన ఉంటుందని చెప్పారు.
'సరైన నిర్ణయం'
సైన్యం ప్రకటనపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇండోనేసియా నౌకాదళం, వాయుసేన కమాండర్లు సైతం ఇదే నిర్ణయాన్ని తీసుకునేలా ఒత్తిడి తేవాలని 'హ్యూమన్ రైట్స్ వాచ్' పరిశోధకులు ఆండ్రియాస్ హర్సోనో పేర్కొన్నారు. 'ఆర్మీ కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టెరిటోరియల్, బెటాలియన్ కమాండర్లు హక్కులను కాలరాసే ఈ అశాస్త్రీయ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది' అని అన్నారు.
ఈ తరహా పరీక్షలపై హ్యూమన్ రైట్స్ వాచ్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈజిప్ట్, ఇండియా, అఫ్గానిస్థాన్లో భద్రతా దళాలు ఇలాంటి పరీక్షలు చేయడంపై నివేదిక రూపొందించింది. ఇండోనేసియా పాఠశాలల్లో విద్యార్థులకూ ఇలాంటి టెస్టులు నిర్వహించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా ఖండించింది.
ఇదీ చదవండి:152 మంది పోలీసులకు హోంమంత్రి ఎక్స్లెన్స్ మెడల్