Flight Skids Off Runway: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వే నుంచి జారి.. విమానం టైరు బురదలో చిక్కుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
అసోం జోర్హాట్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు. వారిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.