IndiGo bars specially abled child: దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి రానివ్వని ఘటన రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి బాగా భయపడుతుండటం వల్ల అతని ప్రయాణానికి నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఇండిగోపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..:హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు.
ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది చాలా అమానవీయ ఘటన అని రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇండిగోపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ స్పందించింది. "భయంతో ఉన్న ఆ చిన్నారి స్తిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం దాకా గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారు. కానీ ఫలితం లేకపోయింది" అని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. అనంతరం ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరినట్లు తెలిపింది.
"ఉద్యోగులైనా, ప్రయాణికులైనా అందరినీ కలుపుకొని వెళ్లే సంస్థ ఇండిగో. ప్రతి నెలా మా విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారు" అని ఆ సంస్థ పేర్కొంది.