భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అనేక ప్రత్యేకతలకు సమాహారమైన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్-విశాఖపట్నం(ins visakhapatnam destroyer) విధుల్లో చేరింది. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence minister Rajnath singh) ఈ నౌకను జాతికి అంకితం చేశారు(ins visakhapatnam commissioning). ఈ నౌకను విశాఖపట్నంలో మోహరించనున్నారు.
చైనా దుస్సాహసంతో హిందూ మహా సముద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐఎన్‌ఎస్ విశాఖపట్నం(ins visakhapatnam) విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. నౌకను ప్రారంభించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ కోసం రూపొందించిన ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం.. అన్‌క్లాజ్‌కు చైనా కొత్త భాష్యాలు చెబుతూ దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. చైనాను రాజ్‌నాథ్ బాధ్యతారాహిత్య దేశంగా అభివర్ణించారు.
" 1982-ఐరాస కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం అన్‌క్లాజ్.. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ సహా, సముద్రంలో నిబంధనలను అనుసరించాలని ప్రతిపాదించింది. కాని కొన్ని దేశాలను నేను బాధ్యతారాహిత్య దేశాలు అని పిలవాలని భావిస్తున్నాను. ఆ దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణులతో అన్‌క్లాజ్ వంటి అంతర్జాతీయ చట్టాలకు కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తున్నాయి. వ్యవస్థ దృష్టిలో ఆ చట్టంలోని నిబంధనలు చాలా కీలకమైనవి. కాని కొన్ని దేశాలు తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ ఈ నిబంధనలను తరచూ బలహీనపరుస్తున్నాయి."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.