భారత్ సహా అనేక దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ వివాదాన్ని 'భారతదేశ వాటర్ గేట్ కుంభకోణం'గా విపక్షాలు పేర్కొంటున్నాయి. అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రభుత్వం 1972-74 మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ సంభాషణలను ఆలకించేందుకు గుప్త సాధనాలను వాడారు. ఆ విషయం బహిర్గతం కావడంతో, 1974 ఆగస్టు 8న నిక్సన్ రాజీనామా చేశారు. దీన్ని వాటర్ గేట్ కుంభకోణంగా పేర్కొంటారు.
భారత్‌లో బోయింగ్, డసో, సాబ్ వంటి బడా కార్పొరేట్ సంస్థల ఉన్నతాధికారుల ఫోన్ సంభాషణలను ఆలకించడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారన్న మీడియా కథనాలు ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలకు చెందిన ఈ మూడు సంస్థలు... భారత్‌కు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి.
అంతర్జాతీయ పరిణామాలు
తమ దేశీయ సంస్థల అధికారులు మాట్లాడుకునే విషయాలపై భారత ప్రభుత్వం నిఘా వేయడం ఐరోపా సమాఖ్య (ఈయూ)కు ఏమాత్రం రుచించదు. అమెరికన్ సంస్థ బోయింగ్‌పై నిఘా పెట్టడాన్ని జో బైడెన్ ప్రభుత్వం సహించదు. డొనాల్డ్ ట్రంప్ ఆర్భాటంగా ప్రారంభించిన 'క్వాడ్' పట్ల బైడెన్ అంత ఉత్సాహం కనబరచకపోవడం ఇప్పటికే భారత్ ప్రాధాన్యాన్ని నీరుగార్చుతోంది. అసలే పౌరసత్వ చట్టం (సీఏఏ), మత స్వేచ్ఛ, సైబర్ చట్టాల విషయంలో మనదేశ విధానాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్న పాశ్చాత్య దేశాలు... పెగాసస్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించవచ్చు. ఈ కుంభకోణం భారత్ ప్రతిష్టను దెబ్బతీసి, మిత్రులను దూరంచేసే ప్రమాదం కనిపిస్తోంది. పెగాసస్ స్పైవేర్ సృష్టించిన చిక్కుముడి నుంచి భారత్‌ను బయటపడేయడానికి ఇజ్రాయెల్ సహకరించే సూచనలు కూడా కనిపించడం లేదు.