సైనిక కార్యకలాపాలకే పరిమితమయ్యే శకం నుంచి భారత మిలిటరీ బయటకు వస్తోంది. దౌత్యపరమైన బాధ్యతలనూ భుజాన వేసుకుంటోంది. 2019 డిసెంబర్లో సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె.. ఇప్పటికే అనేక అధికారిక పర్యటనలు చేశారు. మయన్మార్, నేపాల్, యూఏఈ, సౌదీ అరేబియాను చుట్టివచ్చారు. ప్రస్తుతం దక్షిణ కొరియా(డిసెంబర్ 28-30) పర్యటనలో ఉన్నారు.
భారత సైన్యం చేపట్టిన దౌత్యపరమైన బాధ్యతల ఫలితాలు ప్రయోజనకరంగా ఉన్నాయి. సైన్యానికీ పలు విజయాలు దక్కాయి. నాగా అండర్‌గ్రౌండ్ లీడర్ నిక్కీ సుమి నాగా హిల్స్‌కు తిరిగిరావడం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(కే-యంగ్ అంగ్) నేత స్టార్సన్ లమ్కాంగ్ 54 మంది గెరిల్లా యోధులతో లొంగిపోవడం భారత సైనిక దౌత్య ప్రయత్నాలకు ప్రతిఫలాలే. తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు మయన్మార్ దళాలతో సైనిక సహకారం మెరుగుపర్చడం కూడా విజయానికి కారణమని చెప్పవచ్చు.
ష్రింగ్లా వెళ్లడమే రుజువు
భారత్-మయన్మార్ మధ్య సైనిక సహకారం చాలా రోజుల క్రితమే మొదలైనప్పటికీ.. జనరల్ నరవణె బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత ముందుకెళ్లాయి. అసోం రైఫిల్స్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఉత్తర) హోదాలో కోహిమ(నాగాలాండ్ రాజధాని)లో సేవలందించడం సహా మయన్మార్‌తో అనుబంధం ఉన్న భారత సైనిక విభాగంలో పనిచేసిన నరవణెకు.. ఈశాన్య రాష్ట్రంలో తిరుగుబాటు పరిస్థితిపై చాలా వరకు అవగాహన ఉంది. కాబట్టి, అక్టోబర్ 4న మయన్మార్ పర్యటనకు నరవణె వెళ్లడం సాధారణ విషయమేనని అర్థం చేసుకోవచ్చు. కానీ, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా ఆయనతో కలిసి వెళ్లడమే ఆశ్చర్యం కలిగించే విషయం. భారత్‌లో సైనికపరమైన దౌత్య సంబంధాల విస్తరణ జరుగుతుందని ఈ పర్యటన ద్వారా అర్థమవుతోంది.
తిరుగుబాటు నేతలు తలొగ్గడానికి కారణమిదే!