దిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి చెక్ పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం స్మాగ్ టవర్‌ను ఏర్పాటు చేసింది. దీనిని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కన్నాట్ ప్లేస్‌లో ప్రారంభించారు. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు కేజ్రీవాల్. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ టవర్ మంచి ఫలితాలు ఇస్తే.. నగరంలో ఇటువంటి నిర్మాణాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దేశంలో ఇదే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణం కావడం విశేషం.
"ఇది దేశంలో మొట్టమొదటి స్మాగ్ టవర్. ఇది ఒక కొత్త టెక్నాలజీ. మేము దీనిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ నిర్మాణం కలుషితమైన గాలిని పీల్చుకుని.. దిగువ నుంచి స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. ఇది సెకనుకు 1,000 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. ఈ టవర్ నిర్మాణంతో గాలిలో ఉండే ఫైన్పార్టికల్స్(పీఎం2.5) గాఢతను క్యూబిక్ మీటరుకు 150 మైక్రో గ్రాముల నుంచి 100 మైక్రోగ్రాములకు తగ్గించవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలతో 2014 నుంచి దిల్లీలో పీఎం10 గాఢత 300మైక్రోగ్రాముల నుంచి 150మైక్రోగ్రాములకు తగ్గింది."