దేశంలో తొలిసారి డ్రోన్‌ల ద్వారా ఔషధాలను సరఫరా చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టు కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్‌లో సోమవారం ప్రారంభమైంది. నారాయణ హెల్త్‌కేర్ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్ నిర్వహణ కంపెనీ టీఏఎస్ దీనికి నేతృత్వం వహిస్తోంది. రెండు డ్రోన్ల సాయంతో గగన మార్గంలో మందులను తరలిస్తున్నారు. ఇందులో మెడ్ కాప్టర్‌గా పిలిచే ఓ డ్రోన్‌కు కేజీ బరువున్న ఔషధాలను 15 కిలో మీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ర్యాండింట్ అనే. మరో డ్రోన్ 2 కేజీల బరువును 12 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లగలుగుతుంది. ఈ రెండింటినీ 30 నుంచి 45 రోజుల పాటు పరిశీలించనున్నారు.
డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రయోగంలో గుర్తిస్తారు. తద్వారా సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన చర్యలను వారు చేపడతారు. డ్రోన్ల ద్వారా ఔషధాల తరలింపు ప్రక్రియను 100 గంటలు పరిశీలించిన అనంతరం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్-డీజీసీఏకు నివేదిక సమర్పిస్తామని టీఏఎస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గౌరిబిదనూర్‌లోని గగనతలంలో 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.