దేశంలో తొలి మానవసహిత సముద్ర మిషన్ 'సముద్రయాన్' ప్రారంభమైంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో ఈ మిషన్‌ను శుక్రవారం లాంచ్ చేశారు. దీంతో సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరింది.
"శాస్త్ర, సాంకేతికతలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఓవైపు గగన్‌యాన్‌తో దేశం అంతరిక్షంలోకి వెళుతుంటే, మరోవైపు సముద్రం లోతులో కార్యకలాపాలు సాగిస్తోంది. చెన్నైలో సముద్రయాన్‌ను లాంచ్ చేశాను. అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. తాగునీరు, క్లీన్ ఎనర్జీ కోసం వనరులను అన్వేషించడంలో కొత్త శకం మొదలైంది. ఇప్పుడు మనం చేస్తున్నదని ఏ దేశానికీ తీసుపోదని ప్రజలకు అర్థమవుతుంది. ఈ చర్యలతో మనం దేశ కీర్తిప్రతిష్టలను పెంచుతున్నాము."
-- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి.
ఇవీ మిషన్ వివరాలు..
సముద్ర గర్భంలో 6వేల మీటర్ల లోతులో అన్వేషణ చేపట్టడానికి అనువుగా ముగ్గురు మనుషులు ప్రయాణించేందుకు వీలైన వాహనాలను సైంటిఫిక్ సెన్సర్లు, టూల్స్‌తో అభివృద్ధి చేస్తారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా తర్వాత మన దేశానికి మాత్రమే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మధ్య హిందూ మహాసముద్రంలో 6వేల కిలో మీటర్ల లోతు నుంచి పాలీ మెటాలిక్ మైనింగ్ నోడ్యుల్స్‌ను వెలికి తీయడానికి సమీకృత మైనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఇక్కడ జరిగే అధ్యయనాలు సమీప భవిష్యత్తులో వాణిజ్య అవసరాల కోసం ఖనిజ తవ్వకాలు చేపట్టేందుకు బాటలు వేస్తాయి. సముద్ర గర్భం నుంచి ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది.
సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు. అక్కడ ఉండే జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే సముద్ర గర్భంలోని వనరులను వెలికితీయడంపై దృష్టి సారిస్తారు.
సముద్ర వనరుల నుంచి ఇంధనం ఉత్పత్తితో పాటు నిర్లవణీకరణ ప్లాంట్లు నెలకొల్పి సముద్ర నీటిని తాగునీటిగా మార్చడంపై దృష్టిసారిస్తారు.
ఇదీ చూడండి:-సాగర గర్భంలో ఖనిజాన్వేషణ-వెలికితీత పర్యావరణానికి హానికరం