Indias First Indigenous Hovercraft : తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన సుప్రీత చంద్రశేఖర్ అనే యువ మహిళా వ్యాపారవేత్త నేల, నీటిపై నడవగలిగే హోవర్క్రాఫ్ట్ను తయారు చేశారు. భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి హోవర్‌క్రాఫ్ట్ ఇదే. మంగళవారం కోయంబత్తూర్‌లోని సులూర్ సరస్సులో దీని ట్రయన్ రన్ విజయవంతం అయింది. 50 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ హోవర్‌క్రాఫ్ట్ ట్రయల్ రన్‌ను చూసేందుకు సమీపంలోని గ్రామస్థులు ఆసక్తి చూపారు. ఈ ప్రత్యేక వాహనాన్ని తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు.
హోవర్క్రాఫ్ట్ను ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ నిర్వహించే ఆపరేషన్లలో ఉపయోగించవచ్చని యూరోటెక్ పివోట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీత చంద్రశేఖర్ తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దీనిని ఉపయోగించి ప్రజలను కాపాడవచ్చని అన్నారు. ఇది రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్లు, నీటిపై గంటకు 80 కిమీ వేగంతో నడుస్తుందని ఆమె తెలిపారు. కెనడాకు చెందిన ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఈ హోవర్క్రాఫ్ట్ను మేడ్ ఇన్ ఇండియా పథకం కింద తయారు చేశామని వివరించారు సుప్రీత చంద్రశేఖర్.
"వరదలు వచ్చినప్పుడు దేశ ప్రజల కోసం ఉపయోగపడే పరికరాలు అందుబాటులో లేవని మాకు అనిపించింది. అందుకే అటువంటి పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఈ హోవర్‌క్రాఫ్ట్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం."
--సుప్రీత చంద్రశేఖర్, వ్యాపారవేత్త