గుజరాత్ కచ్ జిల్లాలో బన్ని బ్రీడ్‌కు చెందిన గేదె ఐవీఎఫ్ పద్ధతిలో మగ లేగదూడకు జన్మనిచ్చింది. దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. బన్ని జాతి గేదె దాని స్థితిస్థాపకత, శుష్క వాతావరణంలో అధిక పాల ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.. అందుకే పాల ఉత్పత్తి వృద్ధికి జన్యుపరంగా అత్యంత మేలురకమైన ఈ గేదెల సంఖ్యను పెంచడం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ బన్ని బ్రీడ్ గేదె గిర్సోమ్నాథ్లోని ధనేజ్ గ్రామానికి చెందిన పాడి రైతుది. ఇది ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడకు జన్మనివ్వడంపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఈ గేదె యజమాని, సుశీల అగ్రో ఫామ్స్‌కు చెందిన వినయ్ ఎల్ వాలాకు శుభాకాంక్షలు తెలిపింది. మొత్తం ఆరు గేదెలు ఐవీఎఫ్ పద్ధతిలో గర్భందాల్చగా.. తొలి లేగదూడ శుక్రవారం జన్మించినట్లు పేర్కొంది. త్వరలో మరిన్ని దూడలు జన్మించనున్నట్లు వివరించింది.
ఈ ప్రక్రియలో మొత్తం 18 గేదెల్లో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిండాలను అమర్చారు. వాటిలో ఆరు గర్భం దాల్చాయి. అందులో ఒక్కటి ఇప్పుడు లేగదూడకు జన్మనిచ్చింది.
తన వద్ద ఉన్న దేశీయ గేదెలు పాలు తక్కువగా ఇస్తున్నాయని అందుకే 9-12 లీటర్ల పాలిచ్చే బన్ని, ముర్రా బ్రీడ్ గేదెల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నట్లు పాడి రైతు వినయ్ వాలా చెప్పారు. జేకే ట్రస్ట్ ఎన్జీఓ సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. 2017లో దేశంలో తొలిసారి ఓ ఆవు ఐవీఎఫ్ పద్ధతిలో క్రిష్ణ అనే లేగదూడకు జన్మనిచ్చిందని, అప్పుడు కూడా జేకే ట్రస్టే సహకారం అందించిందని గుర్తు చేశారు.