తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రష్యా మీదుగా భారతీయుల తరలింపు.. సకాలంలోనే 'ఎస్400'' - రష్యా ఉక్రెయిన్ ఇండియా

Indians in Ukraine Russia: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని రష్యా తెలిపింది. రష్యా భూభాగం మీదుగా వారిని పంపించాలని భారత్ అభ్యర్థించిందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. మరోవైపు, భారత్​కు ఎస్400 క్షిపణి వ్యవస్థ డెలివరీని అంతర్జాతీయ ఆంక్షలు ప్రభావితం చేయబోవని స్పష్టం చేసింది.

Russian Ambassador-designate
Russian Ambassador-designate

By

Published : Mar 2, 2022, 3:35 PM IST

Indians in Ukraine Russia: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులను రష్యా భూభాగం మీదుగా సురక్షితంగా తరలించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని భారత్​లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ పేర్కొన్నారు. ఖార్కివ్, సుమీ నగరాలతో పాటు ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లోని పౌరుల తరలింపు కోసం మానవతా కారిడార్​ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వీలైనంత త్వరగా భారతీయుల తరలింపును ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయంపై భారత అధికారులతో తాము సంప్రదింపులు సాగిస్తున్నామని వివరించారు.

Russia Ukraine war

"ఖార్కివ్ సహా తూర్పు ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయుల గురించి ఇక్కడి అధికారులతో చర్చిస్తున్నాం. అత్యవసరంగా వారందరినీ రష్యా మీదుగా తరలించాలని భారత్ నుంచి మాకు అభ్యర్థన వచ్చింది. ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించడం కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం."

-డెనిస్ అలిపోవ్, రష్యా రాయబారి

ఉక్రెయిన్​లో భారత పౌరుడు మరణించడంపై డెనిస్ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.

భారత్​కు థ్యాంక్స్

ఐరాసలో భారత్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని డెనిస్ అభినందించారు. ఈ విషయంలో రష్యా వైఖరిని భారత్​కు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామని వివరించారు.

"భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. ఐరాసలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు భారత్​కు కృతజ్ఞతలు. రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడింది కాబట్టే.. భారత్ తటస్థంగా ఉందనేది సరికాదు. ఉక్రెయిన్​లో పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే భారత్ ఇలా వ్యవహరించింది. సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందనేది భారత్​కు అర్థమైంది."

-డెనిస్ అలిపోవ్, రష్యా రాయబారి

Russia S400 delivery:ఉక్రెయిన్​తో ఉద్రిక్తతల నెలకొన్నప్పటికీ.. భారత్​కు సరఫరా చేయాల్సిన ఎస్400 క్షిపణి వ్యవస్థను సకాలంలోనే అందిస్తామని అలిపోవ్ స్పష్టం చేశారు. పాశ్చాత్త దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. వీటి సరఫరాకు ఎలాంటి అడ్డంకులు లేవని అన్నారు.

రష్యా, అమెరికా రెండిటితోనూ...

మరోవైపు, రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు భారత వాయుసేనపై తీవ్రంగా ప్రభావం చూపవని ఎయిర్​ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ స్పష్టం చేశారు. రెండు దేశాలతో భారత్ సంబంధాలు దృఢంగానే కొనసాగుతాయని చెప్పారు. 'ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల గురించి తెలుసు. పరిస్థితులను సమీక్షిస్తున్నాం. కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ అవి ఎక్కువగా ప్రభావం చూపుతాయని అనుకోవడం లేదు. రెండు దేశాలతో మా సంబంధాలు బలంగానే ఉన్నాయి' అని వివరించారు.

భారత పౌరుల తరలింపు కోసం మూడు విమానాలను పంపినట్లు సందీప్ తెలిపారు. రోజుకు నాలుగు విమానాలను నడపగలమని చెప్పారు. తరలింపు ప్రక్రియ 24 గంటలు నడుస్తోందని.. భారతీయులందరినీ వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:31 విమానాలు.. 6,300 మంది.. పక్కా ప్లాన్​తో 'ఆపరేషన్​ గంగ'

ABOUT THE AUTHOR

...view details