అది కదన రంగంలో నిప్పులు కురిపించే యుద్ధ విమానం కావొచ్చు. ప్రయాణీకులని సురక్షితంగా గమ్యానికి చేర్చే కమర్షియల్ విమానం కావొచ్చు. వాటిని అత్యంత చాకచక్యంగా నడిపించి శెభాష్ అనిపించుకుంటున్నారు అమ్మాయిలు. గత ఏడాది శివాంగీలాంటి వాళ్లు యుద్ధ విమానాలు నడిపించి భేష్ అనిపించుకుంటే నిన్నటికి నిన్న 17 వేల కిలోమీటర్ల దూరాన్ని ఉత్తర ధ్రువంమీదుగా అవలీలగా నడిపేసి ఔరా అనిపించుకుంది ఆల్‌విమెన్‌టీం. పైలట్లుగా అమ్మాయిలు తిరగరాస్తున్న విజయాల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇతర రంగాలతో పోల్చుకుంటే విమానయాన రంగం సున్నితమైంది, సంక్లిష్టమైందీ కూడా. అపారమైన సాంకేతిక పరిజ్ఞానంతోపాటూ వాతావరణ పరిస్థితులకు ఎదురీదే మనోధైర్యం కూడా ఉండాలి. వీటన్నిటికీ మేం సిద్ధం అంటున్నారు అమ్మాయిలు. అందుకే తమ కెరీర్‌గా విమానయాన రంగాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 2017 తర్వాత దేశంలో వివిధ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న మహిళా పైలట్ల సంఖ్య రెట్టింపైంది. ఆ ఏడాది మహిళాపైలట్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్టమే ఇందుకు కారణమైంది.
- 12.4 -మొత్తం పైలట్లలో మహిళల శాతం
- 8737 -మనదేశంలో మొత్తం పైలట్ల సంఖ్య
- 1092 -మహిళా పైలట్లు