తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి మండపంలో సరదాగా గన్​ ఫైర్.. పోలీస్ కేస్​తో వధువు పరార్.. దొరికితే రెండేళ్లు జైలు శిక్ష! - వివాహంలో పెళ్లి కూతురు కాల్పులు

వివాహాన్ని గుర్తుండిపోయేలా మార్చుకోవాలనుకున్న యువతికి షాక్ తగిలింది. పెళ్లి మండపంలో తుపాకీతో కాల్పులు జరిపిన యువతి.. పోలీసులకు టార్గెట్ అయింది. తన కోసం వస్తున్నారని తెలిసి యువతి పరార్ అయింది.

wedding celebratory-firing bride-on-the-run
wedding celebratory-firing bride-on-the-run

By

Published : Apr 10, 2023, 6:42 PM IST

సొంత పెళ్లిలో విచిత్ర చేష్టలకు పాల్పడి అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకుంది ఓ నవ వధువు. వివాహ వేడుకలో భాగంగా పెళ్లి మండపం నుంచే తుపాకీతో కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారగా.. పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో యువతి పరార్ అయింది. ఉత్తర్​ప్రదేశ్​, హాథ్రస్ జంక్షన్​లోని సాలెంపుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వివాహ వేడుకలో భాగంగా వరుడితో పాటు నవ వధువు వేదికపై కుర్చీలో కూర్చుంది. దండలు మార్చుకోవడం వంటి కార్యక్రమాలు పూర్తి కాగానే.. పెద్దల ఆశీర్వాదం తీసుకొని అతిథులను పలకరిస్తోంది కొత్త జంట. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తుపాకీని తీసుకొచ్చి వధువు చేతికి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. ఆ రివాల్వర్​ను అందుకున్న యువతి.. ఐదు సెకన్ల వ్యవధిలోనే నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. పక్కనే ఉన్న వరుడు ఎటూ పాలుపోని స్థితిలో తల తిప్పకుండా కూర్చొని ఉండిపోయాడు. కాల్పులు జరిపిన తర్వాత తన వెనక నవ్వుతూ నిల్చున్న ఓ వ్యక్తికి తుపాకీ అప్పగించింది ఆ యువతి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు.

పోలీసుల కేసు..
ఈ వీడియో వెంటనే వైరల్​గా మారింది. స్థానిక నెటిజన్లు దీన్ని విపరీతంగా షేర్ చేశారు. అలా.. ఇది పోలీసుల వద్దకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు హాథ్రస్ ఏఎస్​పీ అశోక్ కుమార్ సింగ్ వెల్లడించారు. వధువు పరారీలో ఉందని తెలిపారు. వధువు కుటుంబ సభ్యులను త్వరలోనే ప్రశ్నిస్తామని చెప్పారు. ఆమెకు తుపాకీ అందించిన వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... నిందితులను పట్టుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వివాహ వేడుకల్లో ఇలా తుపాకీతో కాల్పులు జరిపే సంఘటనలు ఉత్తర భారత్​లో తరచుగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ ఘటనల్లో మరణాలు సైతం సంభవిస్తుంటాయి. అనేక మంది గాయపడ్డ ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వివాహాల్లో కాల్పులను నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుధాల చట్టాన్ని 2019లో సవరించింది. వేడుకల్లో ఎవరైనా కాల్పులు జరిపితే నేరాభియోగాలు మోపేలా చట్టాన్ని మార్చింది. సవరించిన చట్టం ప్రకారం.. వివాహాలు, ఇతర వేడుకల్లో కాల్పులు జరిపిన దోషులకు రూ.లక్ష జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇటువంటి ఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా.. పోలీసులే స్వయంగా కేసు నమోదు చేసుకోవాలని 2016లో హైకోర్టు స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details