దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. వైరస్ మార్పులు ఆందోళనకరంగా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది! దిల్లీ, మహారాష్ట్రల్లో రెండు సార్లు ఉత్పరివర్తనం చెందిన(డబుల్ మ్యూటెంట్ వేరియంట్) కొవిడ్ వైరస్ తాజాగా వెలుగుచూసింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కలకలం సృష్టించిన ఈ వైరస్లు.. మన దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు పెరుగుతుండటానికి ఈ వైరస్‌లే కారణమా? కాదా? అనేది కచ్చితంగా చెప్పలేమంది. అయితే.. వీటి జన్యుక్రమం, ఉత్పరివర్తనాలు, వ్యాప్తిపై 'ఇండియన్ సార్స్ కొవ్-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్(ఇన్సాకాగ్)' అధ్యయనం సాగిస్తున్నట్టు తెలిపింది. 10 జాతీయ స్థాయి ప్రయోగశాలలు కలిసి గత డిసెంబర్ 25న ఇన్సాకాగ్ ఏర్పడింది.
ఇదీ చదవండి:'మృతులలో 88 శాతం మంది వారే'
ఆ మూడు రకాల వైరస్‌లూ..
"విదేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి, వారి ద్వారా మహమ్మారి సోకిన వారికి ఇన్సాకాగ్ పరీక్షలు చేసింది. మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10,787 నమూనాలను సేకరించి వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించింది. వీటిలోని 771 కేసుల్లో వైరస్ మార్పులు వైవిధ్యంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా 736 కేసులకు బ్రిటన్ వైరస్; 34 కేసులకు దక్షిణాఫ్రికా రకం; ఒక్క కేసుకు బ్రెజిల్ వైరస్ కారణమని నిర్ధరణ అయింది. రెండుసార్లు మార్పులకు లోనైన ఆందోళనకర కరోనా వైరస్(వీఓసీ).. దిల్లీ, మహారాష్ట్రల్లో వెలుగు చూడటం గమనార్హం. దేశంలో సుమారు 70 జిల్లాలకు కరోనా కొత్త రకాలు విస్తరించాయి." అని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి:'ఆ వ్యాధుల నివారణలో ముందున్న భారత్'