Indian Railways Wheel Tender : రైల్వే చక్రాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులు సైతం చేపట్టే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఓ బ్లూ ప్రింట్‌తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఏడాదికి 80వేల చక్రాలను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు టెండర్ ఆహ్వానిస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైస్పీడ్ రైళ్లకు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు అవసరమైన చక్రాలను ‘మేకిన్ ఇండియా’ ప్లాంట్‌లో తయారీకి నిర్ణయించినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదికి రూ.600 కోట్ల విలువైన 80వేల చక్రాలు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైలు చక్రాల తయారీకి ప్రైవేటు వ్యక్తులను ఈ విధంగా ఆహ్వానించడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి చెప్పారు.
భారతీయ రైల్వేకు ఏటా రెండు లక్షల రైలు చక్రాలు అవసరం. ఇందులో కొన్నింటిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సమకూరుస్తోంది. తాజా ప్రణాళిక ప్రకారం మిగిలిన వాటిని మేకిన్ ఇండియా ప్లాంట్ సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉక్రెయిన్, జర్మనీ, చెక్ రిపబ్లిక్ వంటి యూరప్ దేశాల నుంచి రైల్వే శాఖ చక్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి చక్రాల దిగుమతి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దేశీయంగా ఉత్పత్తికి నిర్ణయించింది. మరోవైపు 30వేల వందేభారత్ ట్రైన్ వీల్స్ కోసం చైనా కంపెనీకి ఇప్పటికే కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.