Indian Railways transporting Buses: ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో రవాణా చేసి భారత రైల్వే సరికొత్త అధ్యాయనానికి నాంది పలికింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులను.. కర్ణాటకలోని బెంగళూరు పరిధి దొడ్డబళ్లాపుర నుంచి పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు రైలులో రవాణా చేసింది. ఈ రవాణా ద్వారా కొత్త మైలురాయిని చేరినట్లు సౌత్ వెస్టర్న్ రైల్వే ట్వీట్ చేసింది.
బెంగళూరులోని అశోక్ లేలాండ్ సంస్థ 300 బస్సుల ఉత్పత్తికి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని బెంగళూరులో వీటిని తయారు చేశారు. అయితే రోడ్డు మార్గంలో బస్సులను తరలించాలంటే భారీగా ఖర్చవుతుంది. దీంతో గూడ్స్ రైలులో తక్కువ ఖర్చుతో బస్సులను అశోక్ లేలాండ్ రవాణా చేసింది.
బస్సులు తయారైన బెంగళూరులోని దొడ్డబళ్లాపుర నుంచి చండీగఢ్ వరకు 2,825 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకునేందుకు 5 రోజుల సమయం పడుతుంది. ఈ కారణంగానే బస్సులను రైలులో రవాణా చేశారు. మే 15న 32 బస్సులు, మే 20న మరో 32 బస్సులను రైలులో రవాణా చేసింది అశోక్ లేలాండ్. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో బస్సులను తరలిస్తారు. భారత రైల్వేలో బస్సులను రవాణా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు గూడ్స్ రైళ్లలో ట్రాక్టర్లు, బైక్‌లను రవాణా చేశారు.