ఇకపై రైలు ప్రయాణాల్లో తమతోపాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికెట్ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. అయితే ఏసీలో కాకుండా వేరే బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదా? స్టేషన్‌కు ఎన్ని గంటల ముందుకు చేరుకోవాలి? రైలు క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి?
పెంపుడు జంతువులను మనతోపాటు తీసుకెళ్లొచ్చా?
నిర్మొహమాటంగా.. మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు, పందులు, కుందేళ్లు వంటి పెంపుడు జంతువులను మనం ప్రయాణించే రైలులో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. వీటి కోసం రైల్వే బోర్డు నిర్దేశించిన కొంత రుసుమును చెల్లించి ప్రత్యేకంగా టిక్కెట్ కొనాల్సి ఉంటుంది. కాకపోతే ఈ టిక్కెట్లను పొందాలంటే ప్రత్యేకించి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. అధికారులు తేనున్న ఈ నూతన వ్యవస్థ కారణంగా ఈ సంప్రదాయ పద్ధతికి ముగింపు పలికే ఆస్కారం ఉంది. దీంతో చాలామందికి ఊరట లభించనుంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలలాగే పెంపుడు జంతువులకు కూడా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అంశాన్ని పరిశీలించాలని రైల్వేకి సంబంధించి ప్రత్యేక కేంద్రాన్ని కోరింది రైల్వే మంత్రిత్వ శాఖ. అక్కడి నుంచి పచ్చజెండా వస్తే గనుక మీతో(ప్రయాణికులు) పాటే IRCTC వెబ్‌సైట్‌లో మీ పెంపుడు జంతువులకు సైతం టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు.
AC-1తో పాటు SLRలో కూడా..
ఇదివరకు యజమానులు తమ పెంపుడు జంతువులను కేవలం AC ఫస్ట్ క్లాస్ కోచుల్లో మాత్రమే తీసుకెళ్లేందుకు వీలుండేది. రైల్వే బోర్డు తాజా ప్రతిపాదనలో ముఖ్యంగా ట్రైన్ గార్డ్స్ కోసం కేటాయించే SLR కోచ్‌లలో కూడా పెంపుడు జంతువులు ప్రయాణించేలా మార్పులను పొందుపర్చారు. రైలు హాల్ట్‌ల వద్ద యజమానులు జంతువులకు ఆహార పదార్థాలు, నీరు అందించవచ్చు. అయితే AC-2 టైర్, AC-3 టైర్, AC- ఛైర్ కార్, స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో మాత్రం పెంపుడు జంతువులను తీసుకెళ్లడం నిషిద్ధం.