తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న ఆ రైలు టికెట్‌ ధరలు!

రైలులో ప్రయాణించే పర్యటకుల కోసం ఐఆర్​సీటీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ గౌరవ్‌ రైలు టికెట్‌ ధరలను భారీగా తగ్గించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Bharat Gaurav Train
train

By

Published : Dec 1, 2022, 6:45 AM IST

Bharat Gaurav : దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా 'భారత్‌ గౌరవ్‌' పేరుతో పర్యాటక రైళ్లను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లభించలేదు. దీంతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు రైల్వేశాఖ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలుస్తోంది.

భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో గతేడాది ఈ 'భారత్‌ గౌరవ్‌' రైళ్లను రైల్వేశాఖ ప్రారంభించింది. రామాయణ్‌ సర్క్యూట్‌ కింద దిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరే ఈ రైలు.. పలు చారిత్రక ప్రదేశాలను చుట్టుముట్టి నేపాల్‌కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ జర్నీకి థర్డ్ ఏసీ క్లాస్‌ టికెట్‌ ధర రూ.62వేలుగా ఉంది.

మొదట్లో ఈ రైలుకు మంచి డిమాండే లభించినప్పటికీ.. నెమ్మదిగా రద్దీ తగ్గింది. టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు 15ఏళ్ల నాటి ఐసీఎఫ్‌ కోచ్‌లతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారట. దీంతో టికెట్‌ ధరలను తగ్గించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "స్లీపర్‌, థర్డ్‌ ఏసీ టికెట్‌ ధరలు తగ్గించేందుకు అనుమతి లభించింది. త్వరలోనే దీనిపై ఐఆర్‌సీటీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ టికెట్ల ధరను కనీసం 20-30 శాతం తగ్గించే అవకాశాలున్నాయి. అధికారిక నిర్ణయం తర్వాత టూర్‌ ఆపరేటర్‌ దీనిపై ప్రకటన చేస్తారు" అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

నిజానికి 'భారత్‌ గౌరవ్‌' కింద రామాయణ్‌ సర్క్యూట్‌తో పాటు మరో రెండు టూర్‌ ప్యాకేజీ సర్వీసులను కూడా నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ ఏడాది నవంబరులో భారత్‌ గౌరవ్‌ శ్రీ జగన్నాథ్‌ యాత్ర రైల్‌ టూర్‌ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో పాటు రామాయణ్‌ సర్క్యూట్‌లోని రెండో సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు రచించారు. అయితే డిమాండ్‌ లేకపోవడంతో వాటిని ఐఆర్‌సీటీసీ రద్దు చేయాల్సి వచ్చింది.

మరోవైపు, పర్యాటకం కోసం ఇటీవల భారత్‌ దర్శన్‌ రైళ్లను కూడా ప్రారంభించారు. ఈ రైళ్లలో స్లీపర్‌కు ఒక్కో రోజు టికెట్‌ ధర రూ.900, థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర రూ.1500 మాత్రమే. అంటే.. 18 రోజుల ప్రయాణానికి రూ.27వేల కంటే మించదు. దీంతో ప్రయాణికులు భారత్‌ దర్శన్‌ రైళ్లకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details