Indian Origin Student Killed In Australia : ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థినిని దారణంగా హత్య చేశాడో వ్యక్తి. తనను ప్రేమించి వదిలేయడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి ఆమెపై పగ పెంచుకుని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమె కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లలో చుట్టి సజీవంగా పాతిపెట్టాడు. 2021లో జరిగిన ఆస్ట్రేలియాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ (21) అనే యువతి నర్సింగ్ చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్‌జోత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత జాస్మిన్.. తారిక్ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి అతడిని దూరం పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని తారిక్.. ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు.
ఉత్తర పాలింప్టన్ ప్రాంతం నుంచి బాధితురాలిని కిడ్నాప్ చేసి నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్ రేంజ్స్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కళ్లకు గంతలు కట్టి, మృతదేహాన్ని కేబుళ్లలో చుట్టి సజీవంగా పాతిపెట్టాడు. 2021లో జరిగిన ఈ ఘటన వెంటనే వెలుగులోకి రాకపోవడం వల్ల మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు.. జాస్మిన్‌ను హత్య చేసింది తారిక్ అని నిర్ధరణకు వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు తారిక్. ఖననం చేసిన ప్రదేశం నుంచి జాస్మిన్ మృతదేహాన్ని వెలికితీసినప్పుడు.. పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా జాస్మిన్ ఎలా చనిపోయిందో తెలిసింది.
ఈ కేసులో అసాధారణ క్రూరత్వం ఉందని, ఆమె స్పృహ ఉన్నప్పుడే వర్ణించలేని బాధను అనుభవించిందని.. మృతురాలి కుటుంబం తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. కాగా, తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై జాస్మిన్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి క్షణాల్లో ఆమె పడిన వేదనను తలచుకుంటే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. తన బిడ్డను చదువు కోసం విదేశాలకు పంపడమే తాను చేసిన తప్పు అని కంటతడి పెట్టారు. తన కుమార్తె అతడి ప్రేమను తిరస్కరించినా.. నిందితుడు ఆమె వెంట పడేవాడని.. చివరికి హత్యకు పాల్పడ్డాడని వాపోయారు. అలాంటి వాడిని తమ కుటుంబం ఎప్పటికీ క్షమించదని కన్నీరుమున్నీరయ్యారు.