BJP Parliamentary Party Meeting : విపక్షాలు నూతనంగా ఏర్పాటు చేసుకున్న 'ఇండియా' కూటమిపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇండియన్ ముజాహిదీన్, ఈస్ట్ ఇండియన్ కంపెనీ పేరులో కూడా ఇండియా ఉందంటూ విరుచుకుపడ్డారు. కూటమి పేరులో ఇండియా ఉండటం వల్ల ఏమీ మారదని అన్నారు. దేశ విచ్ఛిన్నం కోరే పీఎఫ్ఐ వంటి సంస్థల పేరులోనూ ఇండియా ఉందని గుర్తు చేశారు. సరైన దశాదిశాలేని విపక్షాన్ని ఇప్పటివరకు చూడలేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. 26 పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో.. వారి లక్ష్యంగా పార్లమెంటరీ సమావేశంలో మోదీ విరుచుకుపడ్డారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
కేవలం దేశం పేరును ఉపయోగించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని.. ప్రతిపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రసంగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నాయని, ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నట్లు.. వాటి ప్రవర్తన ద్వారా తెలుస్తోందని ఆయన అన్నారు. కానీ తాము మాత్రం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వ హయాంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.