పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?
18:33 March 11
పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?
Indian Missile in Pakistan: భారత రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణి పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. రోజూవారీ పరీక్షల్లో భాగంగా భారత్ ప్రయోగించిన క్షిపణిలో.. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పాకిస్థాన్‌వైపు దూసుకెళ్లినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదని.. దీనిపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. పాక్ భూభాగంలో క్షిపణి పడటంపై విచారం వ్యక్తం చేసింది.
అంతకుముందు.. భారత్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తమ భూభాగంలో పడిందని పాక్ ఆరోపించింది. 40వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిన ఈ అనుమానాస్పద పరికరం.. 207 కిలోమీటర్లు దూసుకెళ్లి మియాన్ చన్నూ నగరంలో కుప్పకూలినట్లు వెల్లడించింది.
పాకిస్థాన్ గగనతల సరిహద్దును ఉల్లంఘించారని నిరసిస్తూ భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. క్షిపణి ప్రయోగం పాక్‌లోని పౌరుల ఆస్తులకు నష్టం కలిగించడం సహా ఇక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని భారత రాయబారికి పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఫిర్యాదు చేసింది. తమ గగనతలంలోకి క్షిపణి రావడం వల్ల విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.