Indian Groom Pakistani Bride : సీమా హైదర్, అంజూ బాటలో ఇప్పుడు మరో ప్రేమ కథ సరిహద్దులు దాటింది. పాకిస్థాన్‌కు చెందిన అమీనా.. రాజస్థాన్‌కు చెందిన అర్బాజ్‌ను పెళ్లాడింది.అయితే వీరి వివాహంలో అక్రమంగా సరిహద్దులు దాటడం వంటి సాహసాలు లేవు. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరు ఒకటయ్యారు. కానీ వీరి వివాహాం అందరిలా సాధారణంగా జరగలేదు. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు.
వీసా దొరక్కపోవడం వల్ల..
Indian Man Online Wedding Pakisthan Woman : జోధ్‌పుర్‌కు చెందిన అర్బాజ్ ఖాన్ కుటుంబంతో పాకిస్థాన్ కరాచీకు చెందిన అమీనా కుటుంబానికి బంధుత్వం ఉంది. దీంతో అర్బాజ్‌కు అమీనాతో వివాహాం చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు.పెళ్లి కోసం అమీనా.. వీసా దరఖాస్తు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో వీసా దొరకకపోవడం వల్ల అమీనా పాక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో అర్బాజ్- అమీనా.. వర్చువల్‌గా వివాహం చేసుకున్నారు. అమీనాకు వీసా దొరకలేదని.. మళ్లీ వీసాకు దరఖాస్తు చేశామని, త్వరలోనే అమీనా భారత్‌కు వస్తుందని అర్బాజ్ చెబుతున్నాడు.
"పాకిస్థాన్‌లో మాకు బంధువులు ఉన్నారు. మాది పెద్దలు కుదిర్చిన వివాహాం. మా తల్లిదండ్రులు, బంధువులు అమీనాతో నా పెళ్లి చేయాలని నిశ్చయించారు. వీసా దొరకడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నాం. వీసా దొరికాక తను ఇండియా వస్తుంది. అప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాను."
-అర్బాజ్, పెళ్లి కుమారుడు