తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఐఎస్​సీ నుంచి వేడిని తట్టుకునే కరోనా వ్యాక్సిన్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫార్మా సంస్థలు కొవిడ్ టీకా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. నిల్వ, పంపిణీ విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు ఇదివరకే స్పష్టం చేశారు. అతి శీతల స్థితిలో మాత్రమే ఈ వ్యాక్సిన్లు పని చేయనుండటం ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇలాంటి సమస్య లేకుండా 37 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే వ్యాక్సిన్​ను రూపొందించామని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు చెబుతున్నారు.

IISc Developed Heat Tolerant Covid 19 Vaccine
వేడిని తట్టుకునే వ్యాక్సిన్ రూపొందించిన భారత శాస్త్రవేత్తలు

By

Published : Nov 12, 2020, 6:00 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అమెరికా వంటి దేశాల్లో కొద్దిరోజుల క్రితం వరకూ తగ్గిన కేసులు.. క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తోంది. కొవిడ్‌ టీకా ఆవిష్కరణ ఒక సవాలైతే టీకా సక్రమ పంపిణీ మరో సవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోట్లాది ప్రజలకు అతి శీతల పరిస్థితిలో.. టీకాలను సరఫరా చేయటమనేది.. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలకు సవాలుగా మారుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్​సీ) శాస్త్రవేత్తల పరిశోధన.. కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ఐఐఎస్​సీ వ్యాక్సిన్ ప్రత్యేకతలు..

37 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే సామర్థ్యమున్న కరోనా టీకాను ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఐఐఎస్​సీ మాలిక్యులర్‌ బయో ఫిజిక్స్‌ విభాగానికి చెందిన శాస్త్రవేత్త రాఘవన్‌ వరదరాజన్‌ ఈ పరిశోధనకు సారథ్యం వహించారు.

ఈ పరిశోధన వివరాలను జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ కెమిస్ట్రీలో ప్రచురించారు. సాధారణంగా కరోనా వ్యాక్సిన్లు మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పనిచేయగా.. తమ వ్యాక్సిన్‌ 37 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కూడా సమర్థవంతంగా తట్టుకుందని పరిశోధకులు వివరించారు. మరింత అభివృద్ధి చేసిన అనంతరం ఈ టీకా 100 డిగ్రీల సెల్సియస్‌ను కూడా తట్టుకోగలదని వారు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ముందు ఎలుకలు తదితర జంతువులపై ప్రయోగిస్తామని చెబుతున్నారు.

ఆర్థిక సాయం..

క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు సుమారు రూ.10 కోట్ల మేరకు నిధులు అవసరమని.. ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.

వ్యాక్సిన్​ పరిశోధన ఇలా..

తమ వ్యాక్సిన్‌ అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ప్రభావవంతంగా పనిచేసిందని, గినియా పందులపై టీకాను ప్రయోగించినప్పుడు వాటి రోగనిరోధక సామర్థ్యం పెరిగిందని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటికే తయారవుతున్న ఇతర వ్యాక్సిన్లలా పూర్తి స్పైక్‌ ప్రొటీన్‌ను కాకుండా తమ వ్యాక్సిన్‌ దానిలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తుందని వివరించారు.

అల్పాదాయ దేశాలకు మేలు..

అతి ఖరీదైన శీతలీకరణ విధానం అవసరం లేకుండానే వ్యాక్సిన్‌ పంపిణీకి దోహదం చేసే తమ విధానం.. అల్పాదాయ, వెనుకబడిన దేశాలకు వరమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పంపిణీకి తాము కనుగొన్న వ్యాక్సిన్‌ అత్యంత అనువైనదని ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా వస్తున్న ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే.. తమ ప్రొటీన్‌ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేయటం సులభమని.. భారత్‌లో దశాబ్దాల తరబడి ఇదే విధమైన వ్యాక్సిన్లను తయారుచేస్తున్నారన్నారు. ఈ విధానం ద్వారా భారత్‌కు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని వివరించారు.

ఇదీ చూడండి:'స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్​ 92శాతం ప్రభావవంతం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details