Indian Independence Movement: అన్ని విధాలుగా భారత్‌లో విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలు చేసిన ఆంగ్లేయులు తొలుత హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టారు. ఆ తర్వాత హిందువుల్లో కులాల మధ్య అంతరం సృష్టించారు. ముస్లింల్లోనూ సున్నీ-షియాల్లో విభేదాల అగ్గిరగిల్చారు. ఆంగ్లేయుల ఎత్తుగడలోని ఆంతర్యాన్ని ముందే గ్రహించిన ముస్లిం మేధావి మౌలానా హుసేన్ మదాని.. ఆది నుంచీ దీనిపై హెచ్చరిస్తూనే వచ్చారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని బంగర్‌మావు అనే చిన్న పట్టణంలో 1879లో జన్మించిన మౌలానా మదాని తండ్రి సయ్యద్ హబీబుల్లా. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త వారసుల్లో 35వ తరానికి చెందిన కుటుంబం వీరిదంటారు. 13వ ఏట మదాని దారుల్ ఉలూమ్ దియోబంద్ (సున్నీ ఉద్యమంతో ముడిపడిన విద్యాలయం)లో చేరి మహమ్మద్ హసన్ వద్ద శిష్యరికం చేశారు. అక్కడ చదువు పూర్తయ్యాక సౌదీలోని పవిత్ర మదీనాకు వెళ్లి 28 సంవత్సరాలు అరబిక్ వ్యాకరణం బోధించి భారత్‌కు తిరిగి వచ్చారు. ఇంతలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతిస్తున్న కారణంగా తన గురువు మహమ్మద్ హసన్‌ను ఆంగ్లేయులు జైలులో బంధించారు. ఆయనకు మద్దతుగా తాను కూడా మూడేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా భారత జాతీయోద్యమంలో భాగమయ్యారు. ఆది నుంచీ.. హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ.. పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. పాకిస్థాన్ విషయంలో ఈ ముస్లిం మేధావికి, పాక్ మద్దతుదారు మహమ్మద్ ఇక్బాల్‌కు మధ్య ఆ కాలంలో పెద్ద వాగ్యుద్ధమే సాగింది.