Indian Independence: ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ వద్ద 1887 జూన్‌లో జన్మించిన రామ్ ప్రసాద్ బిస్మిల్ చిన్నప్పటి నుంచే హిందీ, ఉర్దూలపై పట్టు సంపాదించాడు. అలవోకగా కవితలు కట్టే ప్రతిభ సొంతం చేసుకుని ఆర్యసమాజ్‌లో సభ్యుడయ్యాడు. బ్రిటిష్‌వారి అకృత్యాలు చూస్తూ పెరిగిన ఆ యువరక్తం కవితల రూపంలో తన ఆవేశాన్ని వెళ్లగక్కేది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా.. అందులో తిలక్ సారథ్యంలోని అతివాదులను మితవాదులు అడ్డుకోవటం బిస్మిల్‌కు నచ్చలేదు. దీంతో.. గెండాలాల్ దీక్షిత్ తదితర స్నేహితులతో కలసి 'మాత్రివేది' అనే విప్లవవాద సంస్థను ఏర్పాటు చేశాడు. తల్లి నుంచి డబ్బు చేబదులు తీసుకొని వచ్చి పుస్తకాలు ముద్రించేవాడు. మన్ కీ లహర్, క్రాంతి గీతాంజలి, బోల్షివిక్ విప్లవం, అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తకాలతో పాటు.. అనేక ప్రాంతీయ భాషల్లోంచి కవితలను కూడా అనువదించి ప్రచురించేవారు. ప్రజల్లో దేశభక్తిని, బ్రిటిష్ పాలనపై తిరుగుబాటును ప్రోత్సహించే కవితలు, వ్యాసాలతో కూడిన ఆ పుస్తకాలను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆయుధాలు కొనేవారు. అయితే ఆ పుస్తకాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆయుధాల సేకరణకు ఇబ్బంది ఏర్పడింది. అంతేగాకుండా లేని కేసులతో ప్రభుత్వం వేధించటంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాడు.
కాంగ్రెస్‌లో చేరి..
1921లో బయటకు వచ్చిన బిస్మిల్... ఇక మీదట విప్లవవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటానంటూ అధికారులకు మాటిచ్చారు. కాంగ్రెస్‌లో చేరారు. తన స్నేహితులు అష్వక్ ఉల్లాఖాన్‌తో కలసి.. 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సుకు హాజరై.. పూర్ణ స్వరాజ్య తీర్మానం కోసం పట్టుబట్టి మరీ సాధించారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఉన్నట్టుండి నిలిపివేయటం నచ్చని బిస్మిల్.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి లాలా హర్‌దయాళ్, సచ్చింద్రనాథ్ సన్యాల్, డాక్టర్ జాదూగోపాల్ ముఖర్జీల సారథ్యంలో.. 1924 అక్టోబరులో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) అనే విప్లవ సంస్థను స్థాపించారు. (ఇదే తర్వాత హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌గా మారింది.) ఆయుధాల సేకరణ బాధ్యత బిస్మిల్‌కు అప్పగించారు.