ప్రభుత్వ రంగ గ్యాస్ రిటైల్ సంస్థలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ను తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా నష్టపోయిన మూడు సంస్థలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపింది. వన్-టైమ్ గ్రాంటు కింద రూ.22 వేల కోట్ల సాయం చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ఈ గ్రాంటు అందుకోనున్నాయి.
'2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్య ఈ సంస్థలు అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లను విక్రయించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వినియోగదారులకు సరఫరా చేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగాయి. కానీ, దేశీయంగా మాత్రం ఈ సమయంలో 72 శాతం మాత్రమే ఎల్పీజీ ధరలు పెరిగాయి. వినియోగదారులపై భారం పడకుండా.. అధిక ధరలను వారికి బదిలీ చేయలేదు. నష్టాలు వచ్చినా.. మూడు సంస్థలు వినియోగదారులకు వంట గ్యాస్‌ను నిరంతరం సరఫరా చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రూ.22వేల కోట్ల గ్రాంటు అందించాలని నిర్ణయించాం' అని ప్రభుత్వ ప్రకటన వివరించింది.