జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, అమెరికా దేశాలలో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మన దేశంలో అక్కడక్కడా నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలకమైన సూచన చేసింది. వైరస్ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి గాను పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.
మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్ జన్యు క్రమ విశ్లేషణకు పాజిటివ్ నమూనాలు పంపించాలని అన్నీ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది.
దీనికోసం ప్రతి రోజు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన నమూనాలను సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) లేబొరేటరీలకు పంపించాలని కోరారు. మరోవైపున.. పలు దేశాల్లో కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం ఉదయం 11.30 గంటలకు దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆరోగ్య, ఆయుష్, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులతో పాటు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం(ఎన్‌టాగి) ఛైర్మన్ ఎన్.ఎల్.ఆరోడా, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.