దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగాన్ని పుంజుకుంటోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 50లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తున్న దేశాల్లో భారత్ ముందుందని కేంద్రం తెలిపింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగింది. ప్రస్తుతం రోజూవారీ డోసుల సంఖ్య 5లక్షలకు పెరిగింది.
లక్ష్యం 30 కోట్లు..
జనవరి 16న దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా, కేవలం 20రోజుల్లోనే 50లక్షల మందికి ఇవ్వగలినట్లు కేంద్రం ప్రకటించింది. శుక్రవారం.. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,814 కేంద్రాల్లో 5,09,893 మందికి టీకా అందించారు. 8 రాష్ట్రాల్లో దాదాపు 61శాతం మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందజేయగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 11.9శాతం మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిడోసు తీసుకున్న వారికి త్వరలోనే రెండో డోసు ఇచ్చే ఏర్పాట్లలో ఆయా ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. జులై నాటికి దేశంలో 30కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంగా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 11.9కోట్ల మందికి..
కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనలో భాగంగా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అత్యవసర వినియోగం కింద 7 వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా 11కోట్ల 90లక్షల మంది టీకాలు తీసుకున్నారు. నిత్యం దాదాపు 45లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అమెరికా అన్ని దేశాలకంటే ముందుంది. ఇప్పటికే అక్కడ 3కోట్ల 67లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది.