తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుర్రం 'రంగు' చూసి ఫిదా.. రూ.23లక్షలకు కొనుగోలు.. స్నానం చేయించాక షాక్!

నల్లగా నిగనిగలాడుతున్న గుర్రాన్ని చూసి అతడు ఫిదా అయ్యాడు. అత్యంత అరుదైన మేలు జాతి అశ్వమని నమ్మి.. ఏకంగా రూ.22.65లక్షలకు కొన్నాడు. ఇంటికొచ్చాక గుర్రానికి స్నానం చేయించిన ఆ వ్యక్తి.. తాను నిలువునా మోసపోయానని గుర్తించి లబోదిబోమంటున్నాడు.

indian black horse
గుర్రం 'రంగు' చూసి ఫిదా.. రూ.23లక్షలకు కొనుగోలు.. స్నానం చేయించాక షాక్!

By

Published : Apr 25, 2022, 4:51 PM IST

అత్యంత అరుదైన మేలు జాతి నల్ల గుర్రమని నమ్మి.. 22 లక్షల 65 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. దేశీ రకం గుర్రానికే నల్ల రంగు వేసి మాయమాటలతో మోసం చేశారని ఆలస్యంగా తెలుసుకుని బాధపడుతున్నాడు. న్యాయం చేయాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. పంజాబ్​ సంగ్రూర్​ జిల్లాలో జరిగిందీ మోసం.

రూ.5లక్షలు లాభమని..: రమేశ్ సింగ్.. పంజాబ్​ సంగ్రూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారి. గుర్రాల ఫారం పెట్టాలని అనుకున్నాడు. తెలిసిన వాళ్లందరితో మాట్లాడాడు. అప్పుడే లెహర్ కలాన్​ గ్రామానికి చెందిన లచ్ఛ్రా సింగ్ అనే వ్యక్తి రమేశ్​ను కలిశాడు. తనకు జితేందర్ పాల్ సెఖోన్, లఖ్విందర్ సింగ్​ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారని, వారు గుర్రాల కొనుగోలులో సాయం చేస్తారని రమేశ్​కు చెప్పాడు లచ్ఛ్రా సింగ్.

జితేందర్​, లఖ్విందర్​ను కలిశాడు రమేశ్​ సింగ్. వారి దగ్గర నల్లగా నిగనిగలాడుతూ, మంచి శరీర దారుఢ్యంతో ఉన్న గుర్రాన్ని చూసి ఫిదా అయ్యాడు. ఆ అశ్వం గురించి మహా గొప్పలు చెప్పారు జితేందర్, లఖ్విందర్. అత్యంత అరుదైన మేలు జాతి మార్వాఢీ గుర్రమని నమ్మబలికారు. తమ దగ్గర రూ.22.65 లక్షలకు కొని, తర్వాత అమ్మితే కనీసం రూ.5లక్షలు లాభం ఖాయమని చెప్పారు. నిజమనుకున్న రమేశ్.. రూ.7లక్షల 60వేల నగదు, మిగిలిన సొమ్ముకు చెక్కులు ఇచ్చాడు.

గుర్రానికి స్నానం.. రమేశ్​ షాక్: ముచ్చట పడి కొన్న గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు రమేశ్. దగ్గరుండి స్నానం చేయించేందుకు సిద్ధమయ్యాడు. పైపుతో నీళ్లు కొట్టి.. శుభ్రంగా కడగడం ప్రారంభించాడు. అప్పుడే రమేశ్​కు గట్టి షాక్ తగిలింది. గుర్రంపై ఉన్న నల్ల రంగంతా పోయింది. లేత గోధుమ రంగులో ఉన్న ఆ గుర్రం మేలు జాతి మార్వాఢీ అశ్వం కాదని, దేశీయ రకమని తేలింది.

కాసేపటికి తేరుకున్న రమేశ్​ సింగ్.. హుటాహుటిన పోలీస్ స్టేషన్​కు పరుగెత్తాడు. జరిగిన కథంతా చెప్పి.. కేసు పెట్టాడు. ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లచ్ఛ్రా సింగ్, జితేందర్, లఖ్విందర్​ కలిసి గతంలోనూ ఇదే తరహాలో కొందరిని మోసం చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ABOUT THE AUTHOR

...view details