తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం ఇప్పటికే చేసింది. చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి సమకూర్చింది. లద్దాఖ్ వద్ద చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి న్యోమా వద్ద కాపలా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం వెల్లడించింది.
చైనా సరిహద్దులోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు - సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు
చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి అందించినట్లు పేర్కొంది.
లద్దాఖ్ ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నందున.. గడ్డకట్టించే చలి సైనికులకు ఎప్పుడూ పెను సవాలు విసురుతూనే ఉంటుంది. శీతాకాలంలో లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు మైనస్ 35 నుంచి 40 డిగ్రీల వరకూ పడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు ఉండేందుకు అత్యంత వేగంగా నిర్మించే ఫాస్ట్ ఎరెక్టబుల్ మాడ్యులార్ షెల్టర్లను కేంద్రం సమకూర్చింది. ఫార్వర్డ్ ఏరియాల్లో కాపాలా కాసే సైనికులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. చాలా వేగంగా నిర్మించే సౌలభ్యమున్న ఈ షెల్టర్లలో 8 నుంచి 40 మంది వరకు సైనికులు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:చైనా సరిహద్దుల్లో మరో 50 వేల సైనికులు