భారత్-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా ఎనిమిదో దఫా కార్ఫ్స్ కమాండర్ స్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. నేడు తూర్పు లద్ధాఖ్లోని చుషూల్ ప్రాంతంలో ఉదయం 9.30 నిమిషాలకు ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నారు. కీలక ప్రాంతాంల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న డ్రాగన్ సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకు రావాలని భారత్ భావిస్తోంది.
ఇప్పటికే మన ఆర్మీ అధికారులు 50వేలకు పైగా బలగాలను వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచారు. అదే స్థాయిలో చైనా తమ సైన్యాన్ని సరిహద్దు వెంబడి ఉంచింది. ఇప్పటి వరకు జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
ఇదీ చూడండి:బలగాల ఉపసంహరణే తక్షణ కర్తవ్యం: కేంద్రం
శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయంపై చర్చించడానికి ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు సెప్టెంబర్లో భేటీ అయ్యారు.