తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట భారీ యుద్ధ ట్యాంకుల మోహరింపు ప్రారంభమై ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో 14 వేల నుంచి 17 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఆ ట్యాంకులు మరింత సమర్థంగా ఉపయోగించేలా ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాయి సాయుధ దళాలు. ఈ క్రమంలో అధునాతన యుద్ధట్యాంకుల విన్యాసాలు చేపట్టాయి.
చైనా సరిహద్దుకు సమీపంలో..
చైనా సరిహద్దుకు కేవలం 40కిలోమీటర్ల దూరంలోనే.. ఈ యుద్ధ ట్యాంకుల విన్యాసాలు, అటాకింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి సాయుధ బలగాలు. అయితే అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద వీటిని నిర్వహించడం కష్టసాధ్యమంటున్న అధికారులు.. ట్యాంకులను సమర్థంగా నిర్వహించగలిగితే సుదీర్ఘ కాలం ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో యుద్ధ ట్యాంకుల నిర్వహణ కోసం గతేడాది.. మౌలిక వసతులను సృష్టించింది భారత సైన్యం. ట్యాంకు షెల్టర్లను సైతం నెలకొల్పింది.
"ఈ ఏడాది కాలంలో మైనస్ 45డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలకు అలవాటు పడ్డాం. చలి వాతావరణంలో.. పర్వత ప్రాంతాల్లో సమర్థంగా పనిచేసేలా ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాం" అని అధికారులు పేర్కొన్నారు.