కశ్మీర్‌లో ప్రశాంతతకు ఆవల తుపాకులు గర్జిస్తున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి భద్రతా సిబ్బంది ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నారు. వణికించే చలిలో, కొండకోనల్లో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య ముష్కరుల దాడులను సమర్థంగా తిప్పికొడుతూ.. ఈ యజ్ఞాన్ని బలగాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తి, వ్యూహాలను అమలు చేస్తూ సైన్యం సరిహద్దు వెంబడి నిత్యం చేస్తున్న పోరాటంలో సానుకూలతలపై 'ఈటీవీ భారత్' క్షేత్రస్థాయి కథనం..
'అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలతో ఉంటావ్'(టు బి ఎలర్ట్.. టు బి ఎలైవ్).. బాదామీబాగ్ కంటోన్మెంట్ ప్రధాన ద్వారంపై పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఈ నినాదం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇటీవల బారాముల్లా జిల్లాలో ఓ ఇంట్లో ఉగ్రవాది దాగాడన్న సమాచారంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఉగ్రవాది చనిపోయి ఉంటాడని భావించి లోనికి వెళ్లారు. కానీ, అకస్మాత్తుగా శిథిలాల మధ్య నుంచి లేచిన ముష్కరుడు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఇలాంటి ఉదంతాలు అనేకం. విపత్కర పరిస్థితుల మధ్య భద్రతా బలగాలు నిరంతరం ఉగ్రవేట కొనసాగిస్తూనే ఉన్నాయి. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఆపరేషన్లు కొనసాగించడం అత్యంత సవాల్‌తో కూడుకున్న పని అని అక్కడి అధికారులు చెబుతుంటారు.
అష్ట దిగ్బంధనం
భద్రతా బలగాలు ఇక్కడ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు కనిపిస్తునప్పటికీ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఉగ్రవాదులు విరుచుకుపడతారని తెలుసు. అందుకే దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ తదితరాలకు చెందిన బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. ఇందులో సుమారు లక్ష మంది శ్రీనగర్‌లోనే పనిచేస్తున్నారు. శ్రీనగర్ జనాభా 16 లక్షలు. అంటే సగటున ప్రతి 16 మందికి ఒకరి చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారన్నమాట. 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లో 400లకు పైగా చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు వందల సంఖ్యలో అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మ్‌డ్ వాహనాలు, వాటి వద్ద సాయుధ సిబ్బంది అడుగడుగునా కనిపిస్తుంటారు.
అత్యాధునిక కంచె..
చొరబాట్లను అడ్డుకునేందుకు నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి అత్యధునిక కంచె వ్యవస్థ (యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ అబ్స్టకిల్ సిస్టం)ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండంచెల్లో ముళ్లతోకూడిన వైర్, మధ్యలో విద్యుత్తు తీగ ఉంటాయి. దీనికి సీసీ కెమెరాలు, ఫ్లడ్‌లైట్లు అనుసంధానం చేసి ఉంటాయి. అలానే మోషన్ సెన్సర్లు కూడా బిగించి ఉంటాయి. వీటి సమీపంలోకి ఎవరైనా వస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఈ వ్యవస్థకు సిస్మిక్ సెన్సర్లు కూడా తోడయ్యాయి. సున్నితమైన శబ్దాలను ఇవి పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజ్ డివైజ్‌లను కూడా భద్రతా సిబ్బందికి సమకూర్చారు. వీటి ద్వారా చిమ్మచీకట్లో కూడా ఎదురుగా చాలా దూరంలో ఉన్న వారిని చూడొచ్చు. మంచులోనూ ఇది పనిచేస్తుంది. మొత్తంగా ఈ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా మార్చే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
సింహస్వప్నం కె-ఫోర్స్
ముష్కరుల గుండెల్లో కె-ఫోర్స్ దడ పుట్టిస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడేందుకు 1990లో రాష్ట్రీయ రైఫిల్స్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 75 వేల మంది పనిచేస్తున్నారు. ఇందులోనూ వివిధ ప్రాంతాల కోసం చొరబాటు నిరోధక విభాగాల(సీఐఎఫ్)ను ఏర్పాటు చేశారు. బందీపురా, బద్గాం, శ్రీనగర్, బారాముల్లా, కుప్వారా, గాందర్బల్ జిల్లాల కోసం కిలో(కె)-ఫోర్స్‌ను నెలకొల్పారు. రాజౌరి, పూంచ్ జిల్లాల కోసం రోమియో(ఆర్)-ఫోర్స్, దోడా జిల్లా కోసం డెల్టా(డి)-ఫోర్స్, అనంతనాగ్, పుల్వామా, సోఫియాన్, కుల్గాం జిల్లాల కోసం విక్టర్(వి)-ఫోర్స్, ఉదంపూర్, బనిహాల్ కోసం యూనిఫాం(యు)-ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 5,081 కిలోమీటర్ల పరిధిలో కె-ఫోర్స్ విధులు నిర్వహిస్తున్న ఉత్తర కశ్మీర్ అత్యంత కీలకమైంది.