Indian Army Nagaland: నాగాలాండ్‌లో పౌరులపై బలగాలు కాల్పుల ఘటనపై 'కోర్ట్ఆఫ్ ఎంక్వైరీ'ని ఏర్పాటు చేసింది భారత సైన్యం. ఈశాన్య భారత్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ జనరల్ ర్యాంకు అధికారి అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొంది.
AFSPA repeal: మరోవైపు నాగాలాండ్‌లో పౌరులపై బలగాలు కాల్పుల ఘటనపై.. ఈశాన్య రాష్ట్రాల సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశ ప్రతిష్ఠ దెబ్బ తింటోంది..
ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయమని తాము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు నాగాలాండ్ సీఎం నీఫియు రియో తెలిపారు.
" నాగాలాండ్ ఘటనపై నేను కేంద్రహోం మంత్రి అమిత్ షాతో మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాం. ఈ చట్టం కారణంగా దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 11లక్షలు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షలు ప్రకటించింది."
-- నీఫియు రియో, నాగాలాండ్ సీఎం
ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాల్సిందే..
ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే(ఏఎఫ్‌ఎస్‌పీఏ) చట్టం, 1958ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సగ్మా.
ఆయనతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ నేతలు, పౌర సంఘాల ప్రతినిధులు.. ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పాలంటే ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని హిన్నూట్రెప్ యూత్ కౌన్సిల్(హెచ్వైసీ) డిమాండ్ చేసింది.
కూలీలపై కాల్పులు జరిపిన బలగాలపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్(కేఎస్‌యూ) డిమాండ్ చేసింది.
Nagaland Firing Incident: నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నాగాలాండ్- మయన్మార్ సరిహద్దుల్లో మోన్ జిల్లాలో జరిగినట్లు పేర్కొన్నారు.
సామాన్య కూలీలపై..
బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు.
ఇదీ చూడండి:Nagaland Under AFSPA: కాల్పుల మోతతో నాగాలు మళ్లీ దూరమవుతారా..?