Indian Army Exercise 2023 :ప్రపంచపు అత్యుత్తమ సైనిక బలగాల్లో ఒకటైన భారత్.. నిరంతరం తన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటూనే ఉంటుంది. ఆధునిక ఆయుధాల వినియోగం నుంచి.. అనితర సాధ్యమైన విన్యాసాలు, సాహసాలు చేయడంలో.. మన వీర సైనికులు అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోరు. యుద్ధక్షేత్రంలోఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే విషయంలో మన సైన్యం నిరంతరం తర్ఫీదు పొందుతూనే ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యాలను పరీక్షించుకుంటోంది. అందులో భాగంగానే తరచూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.
Recent Indian Military Exercises 2023 :తాజాగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత సైన్యం చేసిన విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి. భారత పర్యటనకు వచ్చిన బ్రెజిలియన్ సైనిక జనరల్ టోమస్ మిగ్యుల్ మైన్ రిబీరో పైవా సమక్షంలో మన సైన్యం తన సత్తాను ప్రదర్శించింది. యుద్ధక్షేత్రాన్ని తలపించేలా భారీ ఎత్తున విన్యాసాలను నిర్వహించింది. ఈ సందర్భంగా దేశీయ తయారీ ఆయుధాలను ప్రదర్శించింది. భారత్‌లో తయారైన అర్జున ట్యాంకులు, ALH ధ్రువ్ హెలికాఫ్టర్లు.. తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఆకాశ్ మిసైల్ వ్యవస్థతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇతర క్షిపణులను కూడా భారత సైన్యం తమ విన్యాసాల్లో ఉపయోగించింది.
indian military exercise 2023 Pokhran :ట్యాంకులు, శతఘ్నులు, డ్రోన్లు, హెలికాఫ్టర్లు పరస్పర సమన్వయంతో చేసిన విన్యాసాలు ఉత్కంఠను రేపాయి. రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడిని ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించింది. భారత సైన్యం విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్ మార్మోగిపోయింది. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్యవస్థలపై బ్రెజిల్ సైనిక జనరల్ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో సెప్టెంబరు 2 వరకూ ఆయన పర్యటన సాగనుంది. జనరల్ టోమస్ మిగ్యుల్ పర్యటన బలమైన భారత్-బ్రెజిల్ సంబంధాలకు, ఇరుదేశాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగశాఖ, రక్షణశాఖలు పేర్కొన్నాయి.