తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైబర్‌ యుద్ధానికి భారత్​ సై.. చైనాను వణికించేలా సైన్యంలో కొత్త విభాగం! - పాకిస్థాన్​ సైబర్​ దాడులకు భారత్​ సై

దురాక్రమణలకు కాలుదువ్వే చైనాకు, పక్కలో బల్లంలా తయారైన పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. తమతో ద్విముఖ పోరులోనూ తలపడగల భారత్‌పై సైబర్‌ దాడులకు దిగే ఆ దేశాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అత్యాధునిక కమాండ్ సైబర్ ఆప్స్ అండ్‌ సపోర్ట్ వింగ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. కాలానుగుణంగా యుద్ధ తంత్రంలో సైబర్‌ స్పేస్‌ కీలకంగా మారిన తరుణంలో సైనిక బలోపేతానికి CCOSWను ఏర్పాటు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.

Indian Army CCOSW System Launch Against China And Pakistan
పాకిస్థాన్​, చైనా సైబర్​ దాడుల యుద్ధానికి భారత్​ సై

By

Published : Apr 28, 2023, 7:16 AM IST

Updated : Apr 28, 2023, 8:01 AM IST

ఒకప్పుడు మనుషులు రాళ్లతో యుద్ధం చేసేవారు. తర్వాత కత్తులు బల్లాలతో పోరు సలిపారు. ఇప్పుడు బాంబులు, తుపాకులతో దేశాలు తలపడుతున్నాయి. కాలానుగుణంగా సైబర్‌యుద్ధాలు ముంచుకొస్తున్నాయి. ప్రత్యర్థి ఆయువుపట్టుపై కంప్యూటర్‌లతో చావు దెబ్బకొడుతున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్‌ పరిణామాల్ని ఊహించిన భారత సైన్యం.. రక్షణ రంగ బలోపేతం కోసం కమాండ్ సైబర్ ఆప్స్ అండ్‌ సపోర్ట్ వింగ్స్‌ CCOSWను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వింగ్‌ ఏర్పాటుతో భారత సైన్యం శత్రు దర్బేధ్యంగా మారనుంది.

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నేతృత్వంలో జరిగిన సైనిక కమాండర్ల సమావేశంలో CCOSWను ఏర్పాటు చేయాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. అటు డ్రాగన్‌, పాక్‌లు సైబర్ యుద్ధ సామర్థ్యాన్ని విస్తరిస్తూ భారీ పెట్టుబడులు పెడుతున్న తరుణంలో ఆధునిక సమాచార వ్యవస్థలతో నెట్‌వర్క్‌లను రక్షించాల్సిన అవసరాన్ని సైన్యం సమీక్షించింది. గ్రేజోన్ వార్‌ఫేర్‌తో పాటు సంప్రదాయ యుద్ధంలో సైబర్‌స్పేస్‌ కీలకంగా మారిందని సైన్యం ఎప్పుడో గుర్తించింది. శత్రువుల నుంచి వర్చువల్ హనీట్రాపింగ్‌, హ్యాకింగ్‌ వంటి సైబర్ దాడుల్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్న సైన్యం.. ఈ భద్రతా చర్యల విస్తరణకు CCOSWను నెలకొల్పనుంది. శత్రువులను ఎదుర్కోవడమే కాకుండా సైనిక సైబర్ భద్రతా విధులను నిర్వహించేందుకు CCOSW వ్యవస్థ అత్యంత కీలకం కానుంది.

రక్షణ శాఖలో కృత్రిమ మేధ(AI), బిగ్‌డాటాల ప్రాముఖ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదే పదే ప్రస్తావించిన క్రమంలో CCOSW ఏర్పాటు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. CCOSW ఏర్పాటు క్రమంలో సైన్యంలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌లో మార్పులు చేయనున్నారు. సైనిక సాంకేతిక నిపుణుల తయారీకి మూడేళ్ల టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చి ఆ తర్వాత సైనిక శిక్షణ ఇవ్వనున్నారు.

భారత సైన్యంలో సమూల మార్పులు!
బ్రిటిష్‌ బానిసత్వ చిహ్నాలు, వారసత్వ పద్ధతులు, పేర్లకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబరులో సూచించారు. ఇందుకోసం భారత సైన్యం ఇప్పటికే నడుం బిగించింది. ఇందులో భాగంగానే సైన్యంలో సమూల మార్పులు చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది.

యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు.. వలసవాద పద్ధతులు, బ్రిటిష్‌ పేర్లను మార్చేందుకు భారత సైన్యం పనులు ప్రారంభించింది. సిక్కు, గోర్ఖా, జాట్‌, రాజ్‌పుత్‌ వంటి సైనిక యూనిట్ల పేర్లను కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనలు, చట్టాలు, నియమాలు, విధానాలు, ఆంగ్ల పేర్లను సమీక్షించి అవసరమైన వాటికి మార్పులు చేయాలని ఆర్మీ ఇప్పటికే నిర్ణయించింది. కట్టడాలు, భవనాలు, సంస్థలు, రోడ్లు, ఉద్యానవనాలకు పెట్టిన బ్రిటిష్ క‌మాండ‌ర్ల పేర్లను కూడా తొలగించాలని ఇండియన్‌ ఆర్మీ నిర్ణయించింది.

Last Updated : Apr 28, 2023, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details