కశ్మీర్లో పాక్ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ఘటనలపై 24 దేశాల రాయబారుల బృందం ఆరా తీసింది. ఈ మేరకు నియంత్రణ రేఖ వెంబడి శిక్షణా శిబిరాలను నిర్వహించడం సహా.. సరిహద్దుల్లో ఉగ్రవాద కర్మాగారాలను నడపడంలో దాయాది దేశం పాత్రలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. పాక్ చొరబాటు యత్నాలు, వారు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద రహస్య స్థావరాలు, డ్రోన్లను ఉపయోగించడం వంటి వాటి గురించి యూరోపియన్ యూనియన్(ఈయూ), బ్రెజిల్, మలేసియా సభ్య దేశాల రాయబారులకు వివరించింది భారత సైన్యం.
కశ్మీర్లోని సాంబా సెక్టార్లో సొరంగాలను ఏర్పాటు చేసుకోవడాన్ని గురించి రాయబార బృందంతో ప్రధానంగా చర్చించారు సైనికులు. చొరబాటు యత్నాల్లో భాగంగా.. నియంత్రణ రేఖ వెంబడి వారు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాలను గుర్తించినట్టు వివరించారు.