తూర్పు లద్దాఖ్ వివాదంతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో జనవరి 20న భారత్-చైనా జవాన్లు ఘర్షణకు దిగినట్లు భారత్ సైన్యం తెలిపింది.
నకులా వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) బలగాలు ప్రయత్నించగా.. వారిని భారత బలగాలు అడ్డుకొన్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గతవారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణల్లో పలువురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.
'అవాస్తవాలకు దూరంగా ఉండాలి'
ఘటనపై స్పందించిన భారత సైన్యం అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. "జనవరి 20న ఉత్తర సిక్కింలోని నకులా ప్రాంతంలో భారత్-చైనా జవాన్ల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే స్థానిక కమాండర్ల జోక్యంతో సమస్య అప్పుడే పరిష్కారమైంది. ఇందుకు సంబంధించి అవాస్తవ కథనాలకు దూరంగా ఉండాలని మీడియాను కోరుతున్నా" అని అన్నారు.
'పరిస్థితిని క్లిష్టతరం చేయవద్దు'
అయితే దీనిని ఖండించిన చైనా.. సరిహద్దు వెంబడి పరిస్థితిని క్లిష్టతరం చేయొద్దని భారత్‌ను కోరింది. చైనా బలగాలు సరిహద్దుల్లో శాంతియుత, ప్రశాంతతకు కట్టుబడి ఉన్నాయని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఝావా లిజియాన్ అన్నారు.
"సరిహద్దుల్లో పరిస్థితిని తీవ్రతరం చేసే లేదా క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలి. ఇరు దేశాలు అదే దిశలో పనిచేయాలి. దీని కోసం సరైన చర్యలు తీసుకోవాలి. సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలి" అని చైనా పేర్కొంది. జనవరి 20న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని భారత సైన్యం ధ్రువీకరించిన తర్వాత ఈ మేరకు స్పందించింది చైనా.
తొలి బాధ్యత చైనాదే
తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం. లద్దాఖ్ అంశంపై ఆదివారం భారత్-చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత బృందం మరోసారి స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:రైతన్న 'ట్రాక్టర్ ర్యాలీ'కి సర్వం సిద్ధం